అమరావతి : ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయని పేర్కొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం విజయవాడలో వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ ప్రెన్యుర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సమ్మిట్ నిర్వహిస్తున్న అంబేద్కర్ కళావేదికను ప్రారంభించారు. 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మెటా, అమెజాన్, జోహో లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థలు సాంకేతిక నిపుణులు హాజరు కావడం పట్ల ఆనందంగా ఉందన్నారు.
రాష్ట్రంలో ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సీఎం. ఇప్పటికే మొదటి, రెండు దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపనతో పాటు కొన్ని ప్రారంభం అయ్యాయని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో గ్రామీణ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్‌టెన్షన్ కేంద్రాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రూ.200 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 45 పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాల ఏర్పాటుకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు మద్దతు గా ఉంటుందన్నారు.



















