MP Gurumurthy : ఢిల్లీ – డిజిటల్ యుగంలో వస్తున్న కొత్త సవాళ్లను, అన్యాయమైన వ్యాపార పద్ధతులను ఎదుర్కొనేందుకు 2019 నాటి వినియోగదారుల రక్షణ చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు పలు సవరణలు సూచిస్తూ వైసీపీ (YCP) తరపున తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి (MP Gurumurthy) లోక్ సభలో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశ పెట్టారు. ఈ చట్టంలోని సెక్షన్ 2కి పలు సవరణలు చేయడం ద్వారా అన్యాయమైన వ్యాపార పద్ధతులు అనే నిర్వచనంలో కొత్త అంశాలను చేరుస్తుంది అని తెలిపారు. ముఖ్యమైన షరతులు, నిబంధనలు లేదా చెల్లించాల్సిన రుసుములను దాచిపెట్టడం, వ్యాపారం చేసేటప్పుడు, దానితో సంబంధం ఉన్న ముఖ్యమైన షరతులు, నిబంధనలు లేదా రుసుములను స్పష్టంగా చెప్పక పోవడం, డిమాండ్ బట్టి ధరలు మారడం, సర్‌ఛార్జ్ లాంటివి, వ్యక్తులను బట్టి ధరలు మారడం, వంటి వాటి గురించి చెప్పక పోవడం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో, ఇ-కామర్స్‌లో సైట్లలో ధరలు, షరతులు స్పష్టంగా ఉండక పోవడం వల్ల వినియోగదారులు మోస పోకుండా కాపాడటానికి ఈ సవరణ అవసరమని చెప్పారు.
MP Gurumurthy Key Bill
కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ (Machine Learning) ఇప్పుడు మార్కెటింగ్, అమ్మకాల్లో ఎక్కువగా వాడుతున్నారని అందువలన వినియోగదారుల నిర్ణయాలను అనవసరంగా ప్రభావితం చేసి, వారికి ఉన్న ఎంపికలను తగ్గించవచ్చని తెలిపారు. ఇలాంటి వాటి నుంచి వినియోగదారులను రక్షించడానికి ఈ సవరణ సహాయప డుతుందని అన్నారు ఎంపీ. సబ్ స్క్రిప్షన్‌లను రద్దు చేయడానికి, వస్తువులను తిరిగి ఇవ్వడానికి లేదా సేవలను వదులు కోవడానికి వినియోగదారులకు అనవసరమైన, సంక్లిష్టమైన అడ్డంకులను సృష్టిస్తున్నారని తెలిపారు. డిజిటల్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఆన్‌లైన్ కొనుగోళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. అందువలన సేవలను రద్దు చేయడం లేదా వస్తువులను తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా మారుతోందని. వినియోగదారుల వ్యవహారాల శాఖ డేటా ప్రకారం, ఇ-కామర్స్ కంపెనీలపై లక్షల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీటిలో చాలా వరకు సేవలో లోపాలు, తప్పుడు లేదా పాడైన ఉత్పత్తులు, డబ్బు తిరిగి రాక పోవడం, డెలివరీ ఆలస్యం వంటివి ఉన్నాయని ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈ సవరణ అవసరమని పేర్కొన్నారు.
2019 నాటి వినియోగదారుల రక్షణ చట్టం మంచిదే అయినా డిజిటల్ టెక్నాలజీలు, ఇ-కామర్స్ వేగంగా అభివృద్ధి చెందడం వల్ల కొత్త సమస్యలు వస్తున్నాయన్నారు. భారతదేశంలో 2020 నాటికి 692 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా, 2025 నాటికి ఈ సంఖ్య 900 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా అని అన్నారు. ఈ పెరుగుదల వినియోగదారుల రక్షణ చట్టాన్ని అప్‌డేట్ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోందని తెలిపారు. ఈ సవరణలు డిజిటల్ యుగంలో న్యాయమైన వ్యాపార పద్ధతులను నిర్ధారించడానికి ఒక ముందడుగు అని అన్నారు. మరింత పారదర్శకమైన, నైతికమైన, వినియోగదారులకు అనుకూలమైన డిజిటల్ మార్కెట్‌ను సృష్టించాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇది వినియోగదారుల హక్కులను కాపాడటమే కాకుండా, డిజిటల్ వాణిజ్యంపై నమ్మకాన్ని పెంచి, భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు గురుమూర్తి.
Also Read : Centre Banned 25 OTT : అశ్లీల కంటెంట్ ప్రసారం ఓటీటీ సంస్థలపై నిషేధం
