ఢిల్లీ : రహదారి కనెక్టివిటీ సమస్యలపై తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెన్నై, తిరుపతి యాక్సెస్ కంట్రోల్ హైవే ప్రాజెక్ట్ ప్యాకేజ్ 2కు సంబంధించిన ప్రజా ప్రయోజన అంశాలపై లోక్‌సభలో గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఈ మార్గంలో గ్రామాలు, కాలనీలు, ప్రభుత్వ సంస్థలు, యాత్రికుల సౌకర్యం దృష్ట్యా అదనంగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, వెహికల్ అండర్ పాస్‌లు, లైట్ వెహికల్ అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు వంటి కనెక్టివిటీ సౌకర్యాలు అవసరమని ఎంపీ గతంలోనే కేంద్ర రహదారుల శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపధ్యంలో గురువారం పార్లమెంటులో ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. యాక్సెస్ కంట్రోల్డ్ హైవేలో ఇప్పటికే రెండు వైపులా సర్వీస్ రోడ్లు, కీలక ప్రాంతాల్లో అనేక వెహికల్ అండర్‌పాస్‌లు, లైట్ వెహికల్ అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, వెహికల్ ఓవర్ పాస్‌లు, ఎంట్రీ, ఎగ్జిట్ ప్రణాళికలో భాగంగా అమలు జరుగుతున్నాయని తెలిపారు.
అయితే జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకా మెరుగైన కనెక్టివిటీ కోసం ఎంపీ గురుమూర్తి సూచించిన కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించిందన్నారు. ఇందులో భాగంగా తిరుపతి పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలోని టయోటా షోరూమ్, కొట్రమంగళం వద్ద అదనపు వాహన అండర్‌పాస్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు కేంద్ర మంత్రి. ఈ కొత్త అండర్‌పాస్ సమీప గ్రామాల ప్రజల రాకపోకలకు ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. అయితే యాక్సెస్ కంట్రోల్ హైవేల భద్రతా ప్రమాణాల ప్రకారం ఎక్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయడం ప్రమాదకరమని, అది ట్రాఫిక్ వేగాన్ని నియంత్రిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.
















