MP Gurumoorthy Challenge : కాలుష్య నియంత్రణపై వెనకడుగు ఎందుకు..?

లోక్ సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న

Hello Telugu - MP Gurumoorthy Challenge

Hello Telugu - MP Gurumoorthy Challenge

MP Gurumoorthy : న్యూఢిల్లీ – బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలలో సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు ఉద్దేశించబడిన ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్ల ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై తిరుపతి ఎంపీ మద్దెల‌ గురుమూర్తి (MP Gurumoorthy) గురువారం లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ నిర్ణయం ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ స్పందించారు. 2015లో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గార ప్రమాణాలను నిర్ణయించిందని, 2021లో వీటిని ప్రాంతాల వారీగా మూడు వర్గాలుగా విభజించినట్లు తెలిపారు. వివిధ సంస్థల సిఫారసులు, శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతికత కొరత, వినియోగదారులపై పడే ఆర్థిక భారం, కోవిడ్ ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం 2025 జూలై 11న కొత్త నోటిఫికేషన్ జారీ చేసిందని మంత్రి వివరించారు.

MP Gurumoorthy Key Comments

డిసెంబరు 2030 లోపు మూతపడే విద్యుత్ కేంద్రాలకు “ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్లు” అవసరం ఉండదని, అయితే ప్లాంటు మూసి వేయబోతున్నట్లు ముందుగానే అంగీకారం తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపారు. రాజధాని ప్రాంతాలు, పెద్ద నగరాల్లోని కేటగిరీ–ఏ ప్లాంట్లు 2027 డిసెంబరు నాటికి తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. కేటగిరీ–బి ప్లాంట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ సిఫారసుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కేటగిరీ–సి ప్లాంట్లకు ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ నిబంధనలు వర్తించవని, అయితే 2029 డిసెంబరు నాటికి తప్పనిసరిగా కాలుష్య వాయువులు ఎక్కువ ఎత్తులో వదిలేలా ఏర్పాటు చేసే పొడవైన చిమ్నీ ఎత్తు ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని స్ప‌ష్టం చేశారు.

ఈ నిర్ణయం పర్యావరణ సున్నితమైన ప్రాంతాల్లో గాలి కాలుష్యాన్ని నియంత్రించడానికి అలాగే నీరు, లైమ్‌స్టోన్ వినియోగం, అదనపు విద్యుత్ భారం, కార్బన్ ఉద్గారాలు పెరగకుండా వనరులను సంరక్షించడానికి తీసుకున్నదని మంత్రి స్పష్టం చేశారు. అన్ని ప్లాంట్లు తమ పరిస్థితులకు అనుగుణంగా వ్యయ–ప్రయోజన విశ్లేషణ ఆధారంగా టెక్నాలజీని ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. తీరప్రాంత, అంతర్రాష్ట్ర ప్రాంతాల మధ్య వేరే విధానం లేదని తెలిపారు. నిర్ణయించిన గడువులు పాటించని థర్మల్ విద్యుత్ కేంద్రాలపై పర్యావరణ పరిహారం విధించబడుతుందని కూడా మంత్రి హెచ్చరించారు.

Also Read : HYDRAA Shocking : జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గింపు

Exit mobile version