కేరళ : రాష్ట్ర డీజీపీని రాజ్ భవన్‌కు పిలిచిన గవర్నర్ చర్యను కేరళ సీఎం వి.డి. సతీశన్ తప్పుబట్టారు. తనకు లేదా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా పిలిపించడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఏకపక్ష చర్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్న ఆయన, గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయని, అప్పుడు కూడా రాజ్ భవన్ తీరుపై ఆందోళనలు వ్యక్తమయ్యాయని గుర్తుచేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు సీఎం సతీశన్. ఎస్ఎఫ్ ఐ నిరసనలు , శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ సిజా థామస్ ఫిర్యాదు నేపథ్యంలో గవర్నర్ ఈ చర్య తీసుకున్నారని తెలిపారు. షిప్ బ్లాక్ నిర్మాణాల కోసం కొచ్చిన్ షిప్‌యార్డ్‌కు 18.16 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనివల్ల ₹50,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని , లీజు ద్వారా ఏటా ₹1.70 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశామన్నారు.
ఇకపై ఎటువంటి జాప్యం లేకుండా బుధవారం నుండి సంక్షేమ పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని సీఎం హామీ ఇచ్చారు. పండుగ సీజన్ దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌లు, అడ్వాన్స్‌ల కోసం నిధులు మంజూరు చేశామన్నారు సీఎం. ఓనం కిట్‌ల పంపిణీ సజావుగా సాగనుందని తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో, వరి సేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న చెల్లింపుల కోసం సప్లై కోసం ₹150 కోట్లు , కన్స్యూమర్‌ఫెడ్ కు ₹25 కోట్లు కేటాయించామని తెలిపారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పేరును ఉపయోగించి జరిగిన మోసాలకు సంబంధించిన దర్యాప్తులో కఠిన చర్యలు తీసుకుంటామని సతీశన్ హెచ్చరించారు. క్రీడా శాఖ ప్రత్యేక కార్యదర్శి నివేదిక సమర్పించారని, త్వరలోనే విచారణ విధానంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. .
