హైదరాబాద్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏకశిలా నగర్ లో రియల్ ఎస్టేట్ గూండాగిరి చేస్తున్న వెంకటేష్ పై నిప్పులు చెరిగారు. తాను హెచ్చరించినా కూడా పేట్రేగి పోతున్నారంటే వీరి వెనుక ఉన్నది ఎవరో తేలాల్సిన అవసరం ఉందన్నారు. పలీసులా లేక ప్రభుత్వ పెద్దలా అన్నది అర్థం కావడం లేదన్నారు ఈటల రాజేందర్. ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని దాడులకు పాల్పడుతున్నారో తేలాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ.
కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు అంటూ నిప్పులు చెరిగారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు అని భగ్గుమన్నారు. రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టంగా ఉండడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం ఉండీ ఏం లాభమని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్.
ముడుపుల కోసం నోరు మూసుకుంటే ప్రాణాలు పోతున్నా పట్టించు కోకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని అన్నారు. ఆరు నూరైనా సరే బాధితుల తరపున గొంతు వినిపిస్తూనే ఉంటామని ప్రకటించారు ఎంపీ.
