న్యూడిల్లీ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఒక బాధ్యత కలిగిన మంత్రి ఇలాగేనా మాట్లాడేది అంటూ ప్రశ్నించారు. మార్చి 31 వరకు దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తానంటూ అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అబద్దాలు చెప్తూ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ టార్గెట్ గా అమిత్ షా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. పార్టీని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం తగదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ఇదిలా ఉండగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి కేంద్ర మంత్రి అమిత్ షా తట్టుకోలేక పోతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆయా రాష్ట్రాల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా చేస్తున్నారని, ఇది తగదన్నారు. జనం అన్నీ గమనిస్తున్నారని, బీజేపీకి, దాని మిత్రపక్షాలకు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. గద్దర్ మాజీ మావోయిస్టు అని, తన మావోయిజానికి స్వస్తి పలికి తెలంగాణ సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయంపై పోరాటం చేశారన్నారు. అలాంటి గద్దర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకుంటే తప్పు ఎట్లా అవుతుందని నిలదీశారు. జులై 20 వ తేదీ 2022లో బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ లో నరేంద్ర మోడీ, అమిత్ షా సభకు గద్దర్ హాజరయ్యారని, మరి ఆ విషయం మరిచి పోతే ఎలా అని నిలదీశారు.


















