ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ కేంద్ర సర్కార్ పై.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. కేవలం 15 రోజులు మాత్రమే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని ఎన్డీయే, బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో సమస్యలపై చర్చ జరగ కూడదని బీజేపీ ఎజెండాగా కనిపిస్తోందన్నారు. దేశంలో అనేక సమస్యలపై చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రధానంగా దేశ భద్రతపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ జరగాలన్నారు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు దాడి జరిగితే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఎస్.ఐ.ఆర్ పేరిట ప్రజల ఓటు హక్కును కాలారాసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలో పర్మినెంట్ గా ఉండాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. సెక్యూరిటీ ఆఫ్ పీపుల్,సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దేశ రాజధాని ఢిల్లీలో సెక్యూరిటీ ఆఫ్ హెల్త్ పైన పార్లమెంట్ లో చర్చ చేయాలన్నారు. తాను ఢిల్లీలో అడుగుపెట్టిన సమయంలో ఏ.క్యు.ఐ లెవెల్ 272 ఉందని, కానీ వారం రోజుల క్రితం ఢిల్లీలో ఏ.క్యు.ఐ లెవెల్ 390 దాటిందన్నారు. ఢిల్లీతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ నగరాలు కాలుష్య బారిన పడుతున్నాయని వాపోయారు. తమకు ఇష్టం వచ్చినట్లు పార్లమెంటును నడుపుకుందామని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాల సెక్యురిటీ ఆఫ్ ఎకానమీపై కేంద్రం పార్లమెంట్ లో చర్చ చేయాలన్నారు. ఎక్కువ నిధులు బీహార్, ఏపీకి తరలి పోతున్నాయని ఆరోపించారు.















