అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రణాళికతో ఏపీ ముందడుగు వేస్తోందన్నారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ ప్రాజెక్టులతో పారిశ్రామిక రంగానికి ఊతం వచ్చిందన్నారు. 110 GW హరిత ఇంధన ఒప్పందాలు, నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్ , రక్షణ రంగ క్లస్టర్ల ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టామన్నారు. సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 సన్నాహక సమావేశంలో పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రాజెక్టుల వివరాలు, విధానపరమైన మార్పులు , రంగాల వారీగా మౌలిక సదుపాయాల గురించి వివరించారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు చంద్రబాబు నాయుడు. గత 28 నెలల్లో రాష్ట్రం రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని, గత ఏడాది పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో రూ. 13.50 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని తెలిపారు.
వ్యవసాయం, తయారీ , సేవా రంగాలలో ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు అనుకూలమైన పరిస్థితులను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రముఖ కంపెనీల ప్రాజెక్టులే ఈ పెట్టుబడుల ఆకర్షణలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. రాష్ట్రంలో గూగుల్ 1 GW డేటా సెంటర్‌ను, ఆర్సెలర్ మిట్టల్ తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయని నాయుడు వెల్లడించారు. ప్రభుత్వ పెట్టుబడి హామీలను అమలు చేసే యంత్రాంగంలో భాగంగా నవంబర్ 12, 13 తేదీలలో ‘పారిశ్రామిక ప్రోత్సాహకాల ఎస్క్రో ఖాతా ప్రారంభించ బడుతుందని ఆయన తెలిపారు. పెట్టుబడుల వ్యూహంలో భాగంగా విధాన పరమైన సరళీకరణ చర్యలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. పెట్టుబడులకు ఆటంకంగా ఉన్న నాలా చట్టం రద్దు చేశామన్నారు సీఎం.


















