Monsoon : రుతుపవనాల రాకతో ప్రకృతి అందమైన రూపంలోకి మారింది. పర్వతాలు, లోయలు, జలపాతాలు కొత్తగా కళకళలాడుతుండగా, వాన చినుకులు చల్లదనాన్ని పంచుతున్నాయి. కానీ, ఈ అందాల వెనక కొన్ని ప్రమాదాలు దాగి ఉన్నాయి. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, బురద రోడ్లు, వరదలు వంటి సమస్యలు ప్రయాణాలను ఇబ్బందికరంగా మారుస్తాయి. ఈ నేపథ్యంలో, ఈ వానకాలంలో (Monsoon) ప్రజలు కొన్ని ప్రాంతాలకు వెళ్లకూడదని పర్యటన నిపుణులు సూచిస్తున్నారు.
Monsoon – వర్షాకాలంలో నివారించాల్సిన ప్రదేశాలు:
1. హిమాలయ ప్రాంతాల్లో ట్రెకింగ్ మార్గాలు:
ఉత్తరాఖండ్‌లోని రూపకుండ్, పిండారి గ్లేసియర్, కేదార్‌కాంత లాంటి మార్గాల్లో జూలై-ఆగస్టు మధ్య కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ట్రెకింగ్ మార్గాలు మూసివేస్తారు.
2. జోజిలా పాస్, రోహ్‌తంగ్ పాస్ (లడఖ్ మార్గంలో):
ఈ పాస్‌లు జూలైలో భారీ వర్షాల వల్ల బురదతో నిండిపోతాయి. ఇది రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంది. ప్రయాణికులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.
3. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్:
వానకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా బురదమయం అవుతుంది. దోమలు ఎక్కువవడంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. బోట్ సఫారీలపై ప్రభావం పడుతుంది.
4. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ జలపాతాలు:
వర్షాకాలంలో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తాయి. జలపాతాల వద్ద జారిపడి ప్రమాదాలు సంభవించవచ్చు.
5. గోవా బీచ్‌లు:
జూలైలో గోవాలో భారీ వర్షాలు కురుస్తాయి. వాటర్ స్పోర్ట్స్, బీచ్ యాక్టివిటీలపై ఆంక్షలు ఉంటాయి. పర్యాటక కేంద్రాలు, నైట్ క్లబ్‌లు మూసివేయబడే అవకాశమూ ఉంది.
అధికారులు ఏమంటున్నారు?
వర్షాకాలంలో ప్రయాణాలపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అవసరమైతే మాత్రమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఆక్సిడెంట్‌లు, సహజ విపత్తుల నుంచి రక్షించుకోవాలంటే ముందస్తుగా సమాచారం తెలుసుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.
గమనిక: ప్రయాణాలకు ముందుగా వాతావరణ శాఖ సూచనలను తప్పనిసరిగా పరిశీలించండి.
Also Read : Anjeer Interesting Benefits : ఉదయాన్నే పరగడుపున నానబెట్టిన అంజీర్ తినడం వల్ల ఎన్ని లాభాలో..
