చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం
చెన్నైలోని గిండిలో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో 30 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలలో (ఐటీఐలలో) ఏర్పాటు చేసిన అధునాతన విద్యుత్ ప్రయోగశాలలను ప్రారంభించారు. అదనంగా మరో 40 ప్రభుత్వ ఐటీఐలలో ఆధునిక విద్యుత్ ప్రయోగశాలలను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థతో ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇదే క్రమంలో 59వ రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలో విజేతలుగా నిలిచిన 15 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 25,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.
ఇదే క్రమంలో అఖిల భారత ట్రేడ్ టెస్టులలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన 60 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, 673 మంది జూనియర్ శిక్షణా అధికారులకు నియామక పత్రాలను కూడా అందజేశారు సీఎం. ఈ సందర్బంగా విద్యార్థులను అభినందించారు. వారిని ప్రోత్సహిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు మేలు చేకూర్చేలా తమ కూటమి సర్కార్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. అంతే కాకుండా విద్యా రంగం అభివృద్దికి భారీ ఎత్తున నిధులు కేటాయించినట్లు తెలిపారు. అంతే కాకుండా ఈసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అత్యధికంగా కేటాయింపులు జరిపినట్లు వెల్లడించారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. విద్యార్థులకు సమయం అత్యంత విలువైనదనని, చదువును నిర్లక్ష్యం చేయొద్దని కోరారు.
















