హైదరాబాద్ : చెరువుల అభివృద్ధి ద్వారా వరదలను అదుపు చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. రుతు పవనాల సమయంలో వచ్చే వరదలను నివారించడం లోనూ, వేసవిలో నీటి ఎద్దడిని తగ్గించడం లోనూ చెరువులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, భారీ స్థాయిలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా, చెరువుల ఆక్రమణలను తొలగించి, పేరుకు పోయిన పూడికను తీసివేశారు. ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో ఆరు చెరువులను వాటి సహజ లక్షణాలు దెబ్బ తినకుండా అభివృద్ధి చేశారు. రెండో దశలో మరో 14 చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యత లో భాగంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘పట్టణ వరద నిర్వహణ’ సదస్సులో పాల్గొన్నారు.
చెరువులు, కాలువల పునరుద్ధరణపై ప్రసంగించారు. వరద నివారణలో కీలక పాత్ర పోషించే చెరువులను, కాలువలను హైడ్రా కాపాడుతోందని, ఈ కృషికి కార్పొరేట్ సంస్థల మద్దతు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. చెరువుల అభివృద్ధికి సంబంధించిన అన్ని అనుమతులను ‘సింగిల్ విండో’ విధానంలో మంజూరు చేస్తామని, అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హైడ్రా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ఆర్ సంస్థలకు వివరించారు. హైడ్రా పనులు చేపట్టక ముందు చెరువుల పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు అవి ఎలా మారాయో ఇందులో చూపించారు. ‘ఎల్ నినో’ వంటి పరిస్థితుల వల్ల ఏర్పడే కరువును ఎదుర్కోవడం లోనూ చెరువులు ఎంతగానో తోడ్పడతాయని కమిషనర్ తెలిపారు. నగరంలో చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న ‘విమోస్ టెక్నోక్రాట్స్’ డైరెక్టర్ యూనస్ పర్వేజ్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. సీఎస్ఆర్ నిధులతో ముందుకు వచ్చే సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
నగరంలో చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూసిన పలు సంస్థలు, హైడ్రాతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చాయి. ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్‌లో ఉన్న చిన్న చెరువును అభివృద్ధి చేసేందుకు ‘జెన్‌ప్యాక్ట్’ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం ఆ సంస్థ రూ. 2 కోట్ల పెట్టుబడితో ‘హైడ్రా’ తో ఒప్పందం కుదుర్చుకుంది. మరికొన్ని సంస్థలు కూడా ఈ విషయంలో ఆసక్తిని కనబరిచాయి. ‘అరైజ్ ఇండియా ఫోరమ్’ నిర్వహించిన సమావేశంలో, హైడ్రా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ , అభివృద్ధి పనులను పలువురు అభినందించారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, చెరువుల అభివృద్ధి జరుగుతున్న తీరును ప్రశంసించారు.
















