అమరావతి : అర్నబ్ తుఫాన్ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. అర్నబ్ తుఫాన్ ప్రభావం, సహయక చర్యలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు మొత్తంగా 32 వేల మందితో ఆరా తీశారు. విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష చేపట్టారు. పంట నష్టంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రాథమిక అంచనాలు తయారు చేయాలని సూచించారు. అర్నబ్ తుఫాన్ లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రానికి వివరించాలన్నారు. రాత్రంతా కష్టపడి పని చేసిన అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి.
తుఫాన్ ప్రభావం తగ్గి… సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ఇదే స్పూర్తితో పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు, ఉద్యోగులు, క్షేత్ర స్థాయి సిబ్బంది రాత్రంతా అద్భుతంగా పని చేశారంటూ కితాబు ఇచ్చారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ప్రాణనష్టం సంభవించ లేదన్నారు. అధికార యంత్రాంగం ముందస్తుగా తీసుకున్న చర్యల వల్లే ప్రాణనష్టం జరగకుండా చూసుకోగలిగాం అన్నారు సీఎం. ఆస్తి నష్టం వీలైనంత మేర తగ్గించేందుకు కృషి చేయాలని ఆదేవించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని అన్నారు. సురక్షితంగా ఉన్నామనే భరోసాను తుఫాన ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు కలిగించాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని సమస్యలను ప్రజలే ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న మనమిత్ర వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగించు కోవాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు.

















