హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ కీలక ప్రకటన చేసింది. సంస్థ అధ్యక్షురాలు కవిత జాగృతి జనం బాటకు సంబంధించి కొన్ని మార్పులు చేసినట్లు తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్రను డిసెంబర్ నాలుగో తేదీ నుంచి కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఈ మేరకు గత అక్టబర్ నెల 25వ తేదీన నిజామాబాద్ లో కవిత జనం బాట యాత్ర ప్రారంభించారు. మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ – హన్మకొండ, నల్గొండ, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి, వనపర్తి, కామారెడ్డి జిల్లాల్లో యాత్ర పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో గ్రామీణ జిల్లాల్లో యాత్రను నిలిపి వేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ లేని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో డిసెంబర్ నాలుగో తేదీ నుంచి ఏడో తేదీ వరకు యాత్ర నిర్వహించనున్నారని సంస్థ ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలో డిసెంబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు యాత్ర చేపడుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18, 19 తేదీల్లో, గద్వాల జిల్లాలో 21, 22 తేదీల్లో యాత్ర నిర్వహిస్తారని తెలిపారు. యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, సూర్యాపేట, సిరిసిల్ల, జనగామ, భూపాలపల్లి, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, ములుగు, జగిత్యాల, మహబూబాబాద్, నిర్మల్, నారాయణపేట, సిద్ధిపేట, మంచిర్యాల జిల్లాలో ఫిబ్రవరి మూడో వారం వరకు యాత్ర కొనసాగిస్తారని పేర్కొన్నారు.















