అమరావతి : ఏపీలో గతేడాది కంటే ఎంజేపీ స్కూళ్లలో టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది పదో తరగతి పరీక్షల్లో 95 శాతం మేర ఎంజేపీ విద్యార్థులు ఫలితాలు సాధించారు. ఈ ఏడాది 96.02 శాతంతో ఎంజేపీ విద్యార్థులు సత్తాచాటారు. గతేడాది కంటే 1.02 శాతం మేర ఫలితాలు అధికంగా రావడం గమనార్హం. 2024-25 విద్యా సంవత్సరంలో 5,355 మంది పరీక్షలు రాయగా, ఈ ఏడాది 5,501 మంది పదో తరగతిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షలకు వంద ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాయగా, 32 గురుకులాలకు చెందిన విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతతో పాసయ్యారు. ఎంజేపీ గురుకులాల్లో నంద్యాల జిల్లా నరవాడకు చెందిన విద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో నిలవడం విశేషం. ఆ పాఠశాలకు చెందిన శ్రీసాయి 596 మార్కులతో ఎంజేపీ గురుకులాలకు చెందిన విద్యార్థుల్లో మొదటి స్థానంలో నిలిచారు. రీటా సాహితి 593 మార్కులు, యశస్విని 589 మార్కులు సాధించి రెండు మూడు స్థానాల్లో నిలిచారు.
ఈ నెల 15న విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ ఎంజేపీ విద్యార్థులు సత్తా చాటిన విషయం విదితమే. జూనియర్ ఇంటర్ లో 97 శాతంతో, సీనియర్ ఇంటర్ లో 94 శాతంతో బీసీ విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. నేడు విడుదలైన టెన్త్ పరీక్షల్లోనూ 96.02 శాతం బీసీ బిడ్డలు ఉత్తీర్ణత సాధించి శభాష్ అనిపించుకున్నారు. టెన్త్ లో రాష్ట్ర స్థాయి ఫలితాలు 85.25 శాతం కాగా, ఎంజేపీ ఉత్తీర్ణతా శాతం 96.02 శాతంగా నమోదైంది. రాష్ట్ర స్థాయి ఫలితాల కంటే 10 శాతానికి పైగా సాధించడం విశేషం. జూనియర్ ఇంటర్ లో రాష్ట్ర స్థాయి ఫలితాలు 77 శాతం రాగా, ఎంజేపీలో 97 శాతంతో, సీనియర్ ఇంటర్ లో రాష్ట్రస్థాయి ఫలితాలు 81 శాతం రాగా, ఎంజేపీ విద్యార్థులు 94 శాతంతో సత్తా చాటారు. ప్రభుత్వ పరిధిలో నడిచే అన్ని విద్యా సంస్థల కంటే ఎంజేపీ గురుకులాలు జూనియర్ ఇంటర్ లో ప్రథమ స్థానంలో, సీనియర్ ఇంటర్ లో రెండో స్థానం నిలవడం గుర్తించుకోదగ్గ విషయం. ఈ సందర్బంగా మంత్రి ఎస్. సవిత విద్యార్థులను అభినందనలతో ముంచెత్తారు.

















