హైదరాబాద్ : తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు హైదరాబాద్ లోని మియాపూర్ భూములకు సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవి కావని, పక్కాగా ప్రభుత్వానికి చెందిన ఆస్తులంటూ పేర్కొంది. కోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై స్పందించారు ఆకునూరి మురళి. శనివారం ఆయన ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తను సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ఈ సమయంలో మీరు చారిత్రాత్మక నిర్ణయం తీసుకునేందుకు ఓ ఛాన్స్ వచ్చిందన్నారు.
కోట్లాది విలువ చేసే ఈ భూములను రాష్ట్రం లో విద్యను అభివృద్ధి చేయడానికి కేటాయించాలని కోరారు ఆకునూరి మురళి. ఈ మియాపూర్ భూములను నిజాయితీగా పారదర్శకంగా అమ్మాలని, వాటి ద్వారా వచ్చే రూ. 30,000 లేక 60,000 కోట్లను ఆర్ధిక శాఖ బయట పటిష్టమైన పారదర్శకమైన విధానం తో విద్యానిధి లో జమ చేయాలని సూచించారు. మీకు ఇంకా రెండు సంవత్సరాలు టైం ఉంది. 1200 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు 1200 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లు ఆరుట్ల మోడల్ లో అభివృద్ధి చేయాలని కోరారు. 150 డిగ్రీ కాలేజీలు, 17 యూనివర్సిటీలు అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యను యూరోపియన్ స్థాయి కి తీసుకెళ్లాలని కోరారు. నాకు బాధ్యతలు ఇవ్వండి. ఒక్క రూపాయి జీతం తీసుకుంటాను, కారు కూడా వద్దు. నా సొంత కారు మాత్రమే వాడుతానని ప్రకటించారు.
తాను ఎంపిక చేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్లను ఇవ్వాలని కోరారు ఆకునూరి మురళి. ఇప్పుడు ఉన్న సెక్రటరీని మార్చాలని , ఇద్దరు సీనియర్ ఇంజనీర్లను ఇవ్వాలని పేర్కొన్నారు. మీరు 15 రోజులకొకసారి రివ్యూ కి టైం ఇవ్వండి చాలు . మీకు విద్యా వ్యవస్థను మార్చి చూపిస్తానని అన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న టీచర్లకు లెక్చరర్లకు ఫాకల్టీ కి వాళ్ల సర్వీస్ రూల్స్ వాళ్ల జీత భత్యాలు మార్చాల్సిన అవసరం లేదన్నారు.
