అమరావతి : ఈ దేశ భవిష్యత్తు విద్యార్థులపై ఆధారపడి ఉందన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి. శుక్రవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు.
పాయకరావుపేట పట్టణంలో సమయమంతుల రెడ్డి జెడ్.పి.హెచ్ స్కూల్ లో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్నారు హోం మంత్రి అనిత . విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పేరెంట్స్, స్టూడెంట్స్ తో సెల్ఫీ దిగారు. అనంతరం వంగలపూడి అనిత మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పండగ వాతావరణంలో జరుగుతోందని చెప్పారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహద పడేలా చేస్తుందని అన్నారు. మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ చేశారు. తల్లిదండ్రులు చదువుకున్న పాఠశాలలోనే పిల్లలు చదువుకోవడం ఎంతో అదృష్టం ఉండాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు చూసి తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారని ఇది తమ పనితీరుకు నిదర్శనం అన్నారు వంగలపూడి అనిత. గతంలో జగన్ సర్కార్ విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. కానీ తాము వచ్చాక ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని, దీనిని తప్పకుండా పంతుళ్లు అమలు చేయాలని అన్నారు.
