అమరావతి : దసరా పండుగ వేళ ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఇక నుంచి ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని సంచలన ప్రకటన చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. తాజాగా కూటమి సర్కార్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీని నిర్వహించింది. ఎంపికైన వారందరికీ నియామక పత్రాలు అందజేసింది. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాకు చెందిన 70 మంది టీచర్లుగా ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మంత్రి సవిత. ఈ సందర్బంగా వారందరిని పిలిపించి ప్రతి ఒక్కరికీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు . వారంతా సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో అత్యంత గౌరవ ప్రదమైన వృత్తి ఒక్కటేనని అది విద్యా రంగం అని పేర్కొన్నారు మంత్రి.
రేయింబవళ్లు కష్టపడి పంతుళ్లుగా మారిన మీరంతా పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాము వచ్చాక మెగా డీఎస్సీ నిర్వహించడం జరిగిందని, ఇక నుంచి ఇచ్చిన హామీ మేరకు దశల వారీగా ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు ఎస్. సవిత. అంతే కాకుండా బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఏటా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అత్యధిక బీసీ అభ్యర్థులు టీచర్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించడం ద్వారా బాబుతోనే జాబు అనే నిరుద్యోగుల భావనను నిజం చేశామని మంత్రి వెల్లడించారు.
నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని చెప్పారు ఎస్. సవిత. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ జగన్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను తీవ్రంగా మోసం చేశాడన్నారు. నిజమేనని నమ్మిన నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్లకు వేలకు వేలు ఫీజులు చెల్లించి శిక్షణ పొందారన్నారు. అయిదేళ్లలో ఏనాడూ డీఎస్సీ గాని, ఇతర పోటీ పరీక్షలు గాని నిర్వహించకుండా నిరుద్యోగులను జగన్ తీవ్ర నిరాశకు గురి చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో నూతన టీచర్లతో పాటు వారి బంధువులు, తల్లిదండ్రులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


















