హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత రెండేళ్ల పాలనా కాలంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రధానంగా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలలో ప్రజల సౌలభ్యం కోసం విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చామని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకల్లా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల సమాచారంతో కూడిన సింగిల్ పేజీ డిజిటలైజేషన్‌ను అందుబాలులోకి తీసుకు వస్తామని ప్రకటించారు. ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన యాప్‌ను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు.
దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్ఎసీ తగు కసరత్తు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో నక్షాలు లేని 413 గ్రామాల్లో సరిహద్దుల, భూధార్ నెంబర్ల కేటాయింపు వంటి ప్రధాన అంశాలతో కూడిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయోగాత్మకంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసి పని పూర్తి చేశామని అన్నారు. ఈ ఐదు గ్రామాలకు భూధార్ కార్డులు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. మిగిలిన 408 గ్రామాల్లో పట్టణ ప్రాంతాలు మినహా 373 గ్రామాల్లో రెండవ విడత కింద సర్వే నిర్వహిస్తామన్నారు. మూడవ విడతగా అన్ని జిల్లాల్లోనూ జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసి భూదార్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రంలో ఇంతవరకు భూ సమస్యలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులలో అర్హత కలిగిన వాటిని జనవరి నెలాఖరు కల్లా పరిష్కరిస్తామని ప్రకటించారు.
