అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు విద్యపై. చదువు ఒక్కటే మనకు గుర్తింపును, గౌరవాన్ని ఇస్తుందన్నారు. నేను భారతదేశం అంతటా అనేక విశ్వ విద్యాలయాలను సందర్శించాను. ప్రతి విశ్వవిద్యాలయం జ్ఞానాన్ని అందిస్తుంది. పట్టాలను ప్రసాదిస్తుంది. కానీ కొన్ని విశ్వ విద్యాలయాలు అంతకంటే ఎక్కువే అందిస్తాయి. అటువంటి వాటిలో ‘అమృత’ విశ్వ విద్యాలయం ఒకటి. ఆలోచించడం, నాయకత్వం వహించడం, సేవ చేయడం వంటివి అమృత మీకు నేర్పుతుంది. అదే ఈ విశ్వ విద్యాలయాన్ని ప్రత్యేకమైనదిగా నిలుపుతోంది అని అన్నారు. విద్య అంటే కేవలం వృత్తి పరమైన జీవితాన్ని (కెరీర్) నిర్మించు కోవడం మాత్రమే కాదని అమృత విశ్వసిస్తుంది. అది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినది. కరుణ, విలువలతో సమాజానికి సేవ చేయడానికి జ్ఞానాన్ని వినియోగించు కోవడం దీని ఉద్దేశం. ఆ అద్భుతమైన దృక్పథం పూజ్యనీయులైన ‘అమ్మ’ నుండి వచ్చిందన్నారు.
అమ్మ ఒకసారి ఇలా అన్నారు కరుణ అనే పదాన్ని కేవలం ఒక మాటగా కాకుండా ఆచరణాత్మక మార్గంగా మనం మలచుకోగలిగితే, ప్రపంచంలోని తొంభై శాతం మానవతా పరమైన సమస్యలను పరిష్కరించ గలుగుతాము అని.. ఎంతటి శక్తివంతమైన మాట అది. జ్ఞానం మనకు నైపుణ్యాలను ఇస్తుంది. సాంకేతికత మనకు శక్తిని ఇస్తుంది. కానీ కరుణ వాటికి ఒక పరమార్థాన్ని ఇస్తుంది ..అదే అమృత ప్రతి విద్యార్థికీ నేర్పే అత్యున్నత పాఠం అని ప్రశంసలు కురిపించారు నారా లోకేష్. ఈ రోజు మీరు ఈ ప్రాంగణం నుండి బయటకు అడుగు పెడుతున్నప్పుడు, ఈ లోకం మీ సీజీపీఏ గురించి గానీ లేదా మీ బంగారు పతకాల గురించి గానీ అడగదు. మీరు ఎలాంటి మార్పును తీసుకు వచ్చారు? అని మాత్రమే అడుగుతుంది. యువతకు మంచి వృత్తి జీవితం ముఖ్యం. విజయం ముఖ్యం. కానీ మీ జ్ఞానం మరొకరి జీవితాన్ని మెరుగు పరిచినపుడే నిజమైన విజయం. అదే విద్య అసలైన లక్ష్యం. భారతదేశాన్ని మార్చిన వ్యక్తుల గురించి ఆలోచించినప్పుడు, మనకు డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం గుర్తుకు వస్తారు. ఆయన సంపన్న కుటుంబం నుండి రాలేదు. ఆయన జీవితం సులభంగా సాగలేదు. కానీ ఆయనకు ఒక గొప్ప కల ఉండేది. తన భవిష్యత్తును నిర్ణయించే అవకాశాన్ని ఆయన ఎప్పుడూ తన పరిస్థితులకు ఇవ్వలేదు.
