బెంగళూరు : కర్ణాటక మంత్రివర్గం నుండి మంత్రి నాగేంద్రను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఆగస్టు 13న శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సభ సజావుగా సాగాలని కోరుకుంటే ఎస్టీ అభివృద్ధి కార్పొరేషన్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన మంత్రి బి. నాగేంద్రను తొలగించాలని పేర్కొంది. ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర మాట్లాడారు. ఆ మంత్రి తన పదవిలో కొనసాగితే శాసనసభ , శాసనమండలి కార్యకలాపాలను జరగనివ్వమని హెచ్చరించారు. మే 2023 నుండి జూన్ 2024 వరకు నాగేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ‘కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్’ లో రూ. 89 కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్నారు. అక్రమాలను వివరిస్తూ సూసైడ్ నోట్ రాసి ఆ కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ పి. చంద్రశేఖరన్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ వ్యవహారం బయట పడిందన్నారు.
.కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ , అకౌంట్స్ అధికారి కలిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI)లోని కార్పొరేషన్ ఖాతాలోకి రూ. 187 కోట్లను మళ్లించారని ఆరోపణలు ఉన్నాయన్నారు విజయేంద్ర. నకిలీ చెక్కులు, ఆర్టీజీఎస్ లావాదేవీల ద్వారా రూ. 89.63 కోట్లను అక్రమంగా మళ్లించారని ఆరోపించారు. ఈ నిధులను సుమారు 600 బ్యాంక్ ఖాతాల ద్వారా వివిధ దశల్లో తిప్పి, చివరికి నిందితుల ప్రయోజనం కోసం నగదు, బంగారం , విలాసవంతమైన వాహనాలుగా మార్చారంటూ దర్యాప్తు సంస్థ సీబీఐ పేర్కొందని తెలిపారు. బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించి, బెంగళూరులోని ఎంజీ రోడ్ శాఖకు చెందిన UBI అధికారులు ఈ నిధుల మళ్లింపునకు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.
శాసన సభ సమావేశాలు ప్రారంభం కాకముందే అవినీతిపరుడైన మంత్రి నాగేంద్రను మంత్రివర్గం నుండి తొలగించాలని తాము సీఎం డీకే శివకుమార్ ను డిమాండ్ చేస్తున్నామన్నారు విజయేంద్ర. లేకపోతే నాగేంద్ర రాజీనామాను ముఖ్యమంత్రి తీసుకునే వరకు సభ లోపల , బయట కూడా బీజేపీ , జేడీ(ఎస్) ఈ అంశంపై పోరాడుతాయని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందిన యువత అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు తరలించారని విజయేంద్ర ఆరోపించారు. అనేక నకిలీ బ్యాంక్ ఖాతాలు తెరిచి, వాటి నుండి నగదు డ్రా చేశారని, ఎన్నికల సమయంలోనూ , బంగారం కొనుగోలుకు కూడా ఆ డబ్బును దుర్వినియోగం చేశారని ఆయన పేర్కొన్నారు.
