అమరావతి : తెలంగాణ పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అంతులేని అభిమానం ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందంటూ తను మాట్లాడ లేదని, కావాలని కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం బద్నాం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. కావాలని తనను డీమోరలైజ్ చేయాలని ప్రయత్నించడం దారుణమన్నారు. తమకు ఏపీ ఎంతనో తెలంగాణ ప్రాంతం కూడా అంతే అభిమానం ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోనే ముందస్తుగా జనసేన పార్టీని ఏర్పాటు చేశారని, దీన్ని బట్టి చూస్తే ఆ ప్రాంతం అంటే ఎంతటి ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు.
ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతం పట్ల వివక్ష ప్రదర్శించరని పేర్కొన్నారు. కోనసీమ రైతులను పరామర్శించిన సందర్బంగా ఏదో కొంత దిష్టి తగిలి ఉంటుందని అన్నారే తప్పా ఎక్కడా తెలంగాణ గురించి, ఆ ప్రాంతపు ప్రజల గురించి నోరు జారలేదని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తెలంగాణ ప్రజలపై పవన్ కళ్యాణ్ కు నమ్మకం, ప్రేమ ఉందని మరోసారి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు రాజకీయం చేయాల్సిన అంశం కానే కాదని పేర్కొన్నారు మంత్రి.
