అమరావతి : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. ప్రజలు, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు తనకు లేదన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. తన హయాంలో వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. రైతులకు సూక్ష్మ సేద్యం లేదు, ఎరువులు ఏనాడు సకాలంలో అందించావా అని ప్రశ్నించారు. పంటల భీమా అస్తవ్యస్తంగా అమలు చేయడమే కాదు, ఐదేళ్ల పాటు రైతులకు యంత్రాలు, పరికరాలు పనిముట్లు అందించిన పాపాన పోలేదన్నారు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. రైతుల విషయంలో జగన్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు.
ట్వీట్లు చేసి మహానుభావుడు అనిపించు కోవాలనే జగన్ తాపత్రయం తప్పా మరోటి కాదన్నారు. నేలను నమ్ముకున్న రైతన్నలు జగన్ ట్వీట్లు చూస్తూ కూర్చోరంటూ ఎద్దేవా చేశారు. ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో హలో ఇండియా అంటూ చాటి చెప్పి జగన్ అక్కసు కక్కుతున్నారని మండిపడ్డారు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. తన హయాంలో రైతులు పంటలను రోడ్డెక్కించిన సంగతి మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. కేజీ టమోటా రూ.2కి పడిపోయి, రైతుల కంటతడి పెట్టినప్పుడు జగన్ ఎక్కడున్నారంటూ నిలదీశారు. ఆలుగడ్డకి, ఉల్లిగడ్డకు తేడా ఎప్పటికీ జగన్ అర్ధం కానట్లే.. వారి వాస్తవ పరిస్థితులు ఎన్నటికీ అర్ధం కావన్నారు. కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సమంజసం కాదన్నారు.















