అమరావతి : ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు తెస్తున్నామని ఆ సంస్కరణల అమలు కోసం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించు కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశంపై నిరంతరం అధ్యయనం, జరుగుతూనే ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ పై చంద్రబాబు సమీక్షించారు. వేసవిలో విద్యుత్ సరఫరా, 2026-27 ఏడాదిలో పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. వేసవిలో ప్రతి రోజూ 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేసినట్టు అధికారులు చెప్పారు. ఈ నెలలో ఇప్పటి వరకు 6397 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించు కున్నామని వెల్లడించారు.
గతేడాదితో పోలిస్తే సుమారు 14 శాతం మేర విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు. విద్యుత్ వినియోగం పెరగడానికి వేసవితో పాటు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగిందని అధికారులు వివరించారు. వచ్చే ఆరు నెలల కాలానికి విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలను సీఎం చంద్రబాబుకు వివరించారు. ఏప్రిల్ 2025లో విద్యుత్ కొనుగోలు ధర రూ. 5.20 ఉండగా.. మార్చి 2026 నాటికి రూ. 4.90కు తగ్గించామని అధికారులు చెప్పారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలవుతున్న తీరునుముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యుత్ కొనుగోళ్ల వ్యయం తగ్గాలన్నారు. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. అలాంటి చర్యలన్నింటి పైనా అధికారులు దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో ఏయే దేశాల్లో ఎలాంటి కొత్త ఆవిష్కరణలు అమలు అవుతున్నాయో అధ్యయనం చేయాలని సూచించారు సీఎం.
















