Kandula Durgesh : అమరావతి : మొంథా’ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతతో ఉండాలని ఆదేశించారు. విపత్తు సమయంలో అధికారులు సమగ్ర సన్నద్ధతతో వ్యవహరించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు కందుల దుర్గేష్.
Minister Kandula Durgesh Key Comments
రహదారులపై గండ్లు పడే ప్రాంతాలు, చెట్లు కూలే ప్రమాదం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల్లో నిర్లక్ష్య భావం లేకుండా అప్రమత్తత కలిగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. . స్థానిక యువత, ఎస్డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు మంత్రి.
విపత్తు నిర్వహణకు గ్రామాల వారీగా యువకుల బృందాలను సిద్ధం చేసి వారికి శిక్షణ ఇచ్చి తద్వారా విపత్తు సమయంలో ప్రజలకు సేవలు అందించేలా చూడాలని అన్నారు. తాగునీరు, విద్యుత్, రవాణా, వైద్య సేవలు వంటి అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రతి శాఖ సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు.
రానున్న మూడు రోజుల పాటు అధికారులు 24×7 విధుల్లో ఉండి ప్రజల భద్రతను కాపాడే చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు కందుల దుర్గేష్.
Also Read : K Kavitha Fired on Congress Govt : పాలమూరు ప్రజలు సీఎంను క్షమించరు
