Minister Atchannaidu : శ్రీకాకుళం జిల్లా – రాష్ట్రంలోని మహిళలకు వరం స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). శ్రీకాకుళం జిల్లాలోని సుంగుపురం నుంచి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులో మహిళలతో కలిసి స్వయంగా ప్రయాణించారు. ప్రయాణం సందర్భంగా మహిళలతో ముచ్చటించారు. జీరో ఫేర్ టికెట్లు స్వయంగా అందజేశారు. అనంతరం ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఐదు రకాల బస్సుల్లో (పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ) మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించామన్నారు.
Minister Atchannaidu Key Comments on Free Bus
సమాజంలో సగభాగం అయిన మహిళల గౌరవం, ఆర్థిక సాధికారత పెంపు ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మహిళలతోనే సాధ్యమని భావించి, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల సాధికారతకు పునాది వేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అవకాశాలుగా మలుచుకుంటూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలలో 90 శాతం నెరవేర్చామని, మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం తమ మహిళా సంక్షేమపట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకరరావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సహాయ కలెక్టర్ డి. పృథ్వీరాజ్, ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందం రెడ్డి, ఆర్డీవో సాయి ప్రత్యూష, ఆర్టీసీ డి.సిలు ఎల్.ఎస్. నాయుడు, ఎడిసీ పి. మురళీధర్, పి.వి.ఎస్. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : AP Free Bus Travel : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
