Minister Atchannaidu : అమరావతి : సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). రాష్ట్ర పునర్నిర్మాణంలో చంద్రబాబు, లోకేష్ జంట శ్రమిస్తుంటే ఆరోపణలు చేసే పనిలో జగన్ నిమగ్నం అయ్యారంటూ మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే వ్యవసాయ శాఖలో జరిగిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు లేదా అసెంబ్లీ కి రావాలని సవాల్ విసిరారు. నిజాయితీ పాలనకు ప్రజలు అండగా ఉన్నారని, అబద్దాలతో రాజకీయాలు చేసే జగన్ కాలం ముగిసిందన్నారు. జగన్ ను నమ్మే పరిస్థితిలో జనం లేరన్నారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. పాలన అంటే ఏమిటో కూడా తెలియని జగన్, నాలుగేళ్ల లోపే రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడని అన్నారు.
Minister Atchannaidu Slams Ex CM YS Jagan
రైతు, మహిళ, యువత, ఉద్యోగులు ఎవరినీ సంతోష పెట్టని పాలన జరిపిన నాయకుడు ఇప్పుడు నైతిక విలువలు చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు అచ్చెన్నాయుడు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారని అన్నారు. దీనిని కూడా రాజకీయం చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఆయన హయాంలో మోసాలు తప్పా పెట్టుబడులు ఏపీకి తెచ్చారా అని జగన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. లోకేష్ టెక్నాలజీ, పరిపాలన, పారదర్శకతను రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తుంటే, నాలుగేళ్లలో ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోలేని జగన్ లోకేష్ గురించి నోరు పారేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read : DGP Shivadhar Reddy Warning : డ్రగ్స్ ప్రమాదం అప్రమత్తత అవసరం
