హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెటర్, తెలంగాణ పోలీసు డీఎస్పీ అయిన మహమ్మద్ సిరాజ్, ప్రోటోకాల్ ప్రకారం మర్యాద పూర్వకంగా మంగళవారం డీజీపీ ఆఫీస్ లో ఉన్న డీజీపీ సీవీ ఆనంద్ ను కలిశారు. తను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి అతన్ని చూస్తున్నానని పేర్కొన్నారు ఈ సందర్బంగా సీవీ ఆనంద్. 2013-14 సంవత్సరంలో హైదరాబాద్‌కు చెందిన మాజీ క్రికెటర్, అప్పటి సెలెక్టర్ అయిన అబ్దుల్ అజీమ్, అతని ప్రతిభను వచ్చి చూడమని తనను కోరాడని పేర్కొన్నారు. సిరాజ్ ను వెంటనే రెండు రోజుల లీగ్‌లలో ఆడించారు. ఆ తర్వాత 2015లో మూడు రోజుల లీగ్‌లలో ఆడి, తన వేగం , కచ్చితత్వంతో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసేలా చేశాడు.
2016-17లో రంజీ ట్రోఫీలో 41 వికెట్లు తీసి, ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి సిరాజ్ ఎదిగాడని ప్రశంసించారు డీజీపీ. ప్రతిభ, క్రమశిక్షణ , కఠోర శ్రమ ఎంతటి కఠినమైన అడ్డంకులను అయినా ఎలా అధిగమించగలవో చెప్పడానికి ఒక నిదర్శనం సిరాజ్ అని కొనియాడారు. తన వేగం , తీవ్రతతో, అతను భారత పేస్ బౌలింగ్ విభాగానికి నిలకడగా తన వంతు సహకారం అందించాడు. అతను హైదరాబాద్‌కు చెందిన ఒక అమూల్యమైన తార అని కితాబు ఇచ్చారు డీజీపీ.
మొహమ్మద్ సిరాజ్ విజయం సాధించాలని, భారత జెర్సీలో మరెన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుతున్నట్లు తెలిపారు సీవీ ఆనంద్.
