Minister Atchannaidu : అమరావతి – వైసీపీ అధినేత జగన్ చేపడుతున్న పర్యటనలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన జగన్‌కు లేదని, కేవలం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే పక్కా ప్రణాళికతో యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్‌తో కలిసి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) మీడియాతో మాట్లాడారు. జగన్ పర్యటనలు సినిమా సెట్టింగుల్లా ఉన్నాయని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
Minister Atchannaidu Slams YS Jagan
పరామర్శకు వెళ్తే రైతులను కలిసి మాట్లాడాలి కానీ, ఐదారు జిల్లాల నుంచి జనాన్ని తరలించడం ఎందుకు అని ప్రశ్నించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే రోడ్లపై మామిడి పండ్లను పోశారని ఆరోపించారు.. ఇది క్రిమినల్ మైండ్‌తో చేసే పని అని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి చర్యలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. తోతాపురి మామిడి రైతుల సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని అచ్చెన్నాయుడు తెలిపారు.
ఈసారి 7 లక్షల మెట్రిక్ టన్నుల బంపర్ క్రాప్ రావడం, పల్ప్ పరిశ్రమల వద్ద గతేడాది నిల్వలు ఉండటంతో ధర పడి పోయిందన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలతో మాట్లాడి కిలో మామిడిని రూ.8కి కొనేలా ఒప్పించామని, ప్రభుత్వం తరఫున కిలోకు రూ.4 చొప్పున సాయం అందిస్తున్నామని వివరించారు. ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు సైతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆనందం వ్యక్తం చేసారని తెలిపారు. ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్న తర్వాత కూడా జగన్ పర్యటనలు చేయడం వెనుక దురుద్దేశం ఉందని అన్నారు.
Also Read : HCA President Jagan Mohan Shocking : హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్
