కేరళ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డెయిరీ (పాడి) రంగం వెన్నెముకగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ప్రాంతంలో సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్‌క్లేవ్–2026 కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. పాడి పరిశ్రమ ఉత్పత్తులను పరిశీలించి సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులకు నిత్య ఆదాయం, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించడంలో పాడి పరిశ్రమ రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులకు పశు పోషణ ఆర్థిక భద్రతనిచ్చే మార్గంగా మారిందని, పాల ఉత్పత్తి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయని తెలిపారు. ప్రాచీన కాలం నుంచే పశుపోషణ , డెయిరీ రంగం భారతీయ నాగరికత ఆర్థిక, సామాజిక ,సాంస్కృతిక జీవితంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ముఖ్యంగా డెయిరీ రంగం జాతీయ ఆర్థిక వ్యవస్థకే కాకుండా గ్రామీణ జీవనోపాధులకు, మహిళా సాధికారతకు , పోషకాహార భద్రతకు కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు మంత్రి. అందువల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ అభివృద్ధులను అన్వయిస్తూ డెయిరీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం మన అందరి సమిష్టి బాధ్యత అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పాడి పరిశ్రమ రంగాన్ని మరింత లాభదాయకంగా, సార్ధకంగా మార్చేందుకు శాస్త్రీయ, సాంకేతిక పురోగతిని సమన్వయం చేస్తూ రంగాన్ని శక్తివంతం చేస్తున్న ఇండియన్ డెయిరీ అసోసియేషన్ చేసిన కృషిని మంత్రి హృదయ పూర్వకంగా అభినందించారు.















