అమరావతి : ఏపీ స్కిల్ స్కాం కేసులో ఈడీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు క్లీన్ చిట్ ఇచ్చింది. గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మోపిన ఈ కేసులో 50 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై తిరిగి వచ్చారు. ఎన్నికల్లో నిలబడ్డారు. కూటమితో కలిసి సర్కార్ ను ఏర్పాటు చేశారు. తాజాగా ఈడీ నివేదిక ఇచ్చింది. చంద్రబాబుకు ప్రమేయం లేదని స్పష్టం చేసింది. దీనిపై ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సత్యమే గెలిచింది, నిజాయితీ నిలబడిందని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వడం తన నిష్కళంకమైన రాజకీయ ప్రస్థానానికి దక్కిన గొప్ప విజయమని పేర్కొన్నారు.
సత్యం, న్యాయం మీద నిలబడే నాయకుడు చంద్రబాబు అని ఈ తీర్పు మరోసారి నిరూపించిందని అన్నారు. స్కిల్ కేసులో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేయడం మా అందరికీ గర్వకారణంగా ఉందన్నారు కింజారపు అచ్చెన్నాయుడు.గత ప్రభుత్వం ఎన్ని కక్షపూరిత కుట్రలు చేసినా, చట్టానికి గౌరవం ఇచ్చి ధైర్యంగా నిలబడ్డ నాయకత్వం ఆయనదని ప్రశంసలు కురిపించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు విత్‌డ్రా కావడం తప్పుడు ఆరోపణలు చేసిన వారికి చెంపపెట్టు అని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువతకు ఉపాధి కల్పించాలని ఆయన తెచ్చిన స్కిల్ డెవలప్‌మెంట్ ఆలోచనను కూడా సైకో జగన్ అండ్ కో రాజకీయం చేయడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. అటు ఏపీ సీఐడీ, ఇటు ఈడీ రెండూ ఆయన పాత్ర లేదని తేల్చడం చంద్రబాబు పరిపాలనా దక్షతకు నిదర్శనం అన్నారు.

















