వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60,000 మంది ఉద్యోగులకు ఈ టెక్నాలజీ దిగ్గజం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అందిస్తున్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు కంపెనీ దూకుడుగా ముందుకు సాగడంపై దాని ఉద్యోగులలో అసంతృప్తి పెరుగుతోంది. ప్రస్తుత , మాజీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల బృందం ఒకటి, కంపెనీ ప్రాధాన్యతలను విమర్శిస్తూ ఒక బహిరంగ లేఖను పంపిణీ చేసినట్లు సమాచారం. ఏఐ పెట్టుబడులపై కంపెనీ పెంచుతున్న దృష్టి, ఉద్యోగుల సంక్షేమం, వినియోగదారుల ప్రయోజనాలు మరియు పర్యావరణ నిబద్ధతలకు నష్టం కలిగిస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. కన్సర్న్డ్ మైక్రోసాఫ్ట్ వర్కర్స్ పేరుతో ప్రచురించబడిన ఈ లేఖ, కంపెనీ కార్యాలయ సంస్కృతి గురించి ఒక సంచలన విషయాన్ని పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌లో పని చేయడం ఆనంద రహితంగా, నిరుత్సాహకరంగా మారింది.
ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం అక్టోబర్ 26న మైక్రోసాఫ్ట్ తన తాజా స్వచ్ఛంద ఉద్యోగుల నిష్క్రమణ కార్యక్రమాన్ని ప్రకటించడానికి ముందే ఈ బహిరంగ లేఖ అంతర్గతంగా ప్రచారంలోకి వచ్చింది. కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా పనిభారం పెరగడం, తరచుగా సంస్థాగత పునర్వ్య వస్థీకరణలు, ఉద్యోగ అభద్రత , తమ రోజువారీ బాధ్యతలలో ఏఐ సాధనాలను చేర్చాలనే ఒత్తిడి పెరుగుతోందని ఉద్యోగులు ఆరోపించారు. తగిన శిక్షణ లేదా మద్దతు లేకుండానే తమ ఉద్యోగంలోని దాదాపు ప్రతి అంశంలోనూ ఏఐని ఉపయోగించమని ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నారని వారు ఇంకా పేర్కొన్నారు.
ఉత్పాదకతను నిరంతరం మెరుగు పరచడానికి బదులుగా ఈ సాధనాలు కొన్నిసార్లు అదనపు పనిని సృష్టిస్తాయని ఉద్యోగులు వాదించారు. ఏఐ రూపొందించిన తప్పుడు కంటెంట్‌ను సరి చేయడానికి, సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి , నమ్మశక్యంకాని ఫీచర్లను సరిచేయడానికి ఉద్యోగులు అదనపు సమయం వెచ్చించాల్సి వస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఇది కంపెనీ వాగ్దానం చేసిన సామర్థ్య మెరుగుదలలను ఈ సాంకేతికత అందిస్తోందా అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.
















