అమరావతి : తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 13వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రజలకు అవకాశాలు కల్పించడంలో మాత్రం రెండో స్థానంలో నిలవటం ఆనందంగా ఉందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆసక్తికరమైన అంశంగా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థాయిని బట్టి అంచనా వేసిన యాక్సెస్ స్కోరు 0.51 కాగా వాస్తవంగా సాధించిన స్కోరు 0.66 గా నమోదైంది. అంటే రాష్ట్ర ఆదాయ స్థాయితో పోలిస్తే అంచనాలకు మించి 0.15 పాయింట్లు అధిక స్కోరు ఏపీ సాధించింది. ఆదాయానికి, అవకాశాల కల్పనకు మధ్య ఉన్న ఈ సానుకూల వ్యత్యాసం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అత్యధికంగా నమోదైందని తెలిపారు. కేరళలో+0.07, హిమాచల్ ప్రదేశ్ +0.06 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక రాష్ట్రం ఎంత సంపద సృష్టిస్తుందన్నది ఒక్కటే అభివృద్ధికి కొలమానం కాదని, ఆ సంపదను ప్రజలకు అవసరమైన అవకాశాలుగా మలచటమే ముఖ్యమని ఈ నివేదిక తేల్చి చెప్పింది. తాగునీరు, పారిశుద్ధ్యం, గృహవసతి, స్వచ్ఛమైన ఇంధనం, వైద్య సదుపాయాలు, విద్య, ఉపాధి, బ్యాంకింగ్, బీమా, పింఛన్లు, న్యాయ సేవలు ఎంతమేర ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్న అంశాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేసిందన్నారు సీఎం.
సంపద సృష్టి కోసం పెట్టుబడులు తీసుకురావటంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందించటం అవకాశాలను అన్ లాక్ చేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించటం వల్లే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారని పేర్కొన్నారు. యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ 2026లో దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో ఏపీ రెండవ స్థానంలో నిలవటం గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. జీవన ప్రమాణాలు సహా వివిధ అంశాలను పరిగణనలో తీసుకుని చేసిన ఈ ఇండెక్స్ లో ఏపీ అగ్రస్థానంలో నిలిచేలా పనిచేసిన అందరికీ అభినందనలు తెలిపారు. సోషియో ఎకనామిక్ సెక్యూరిటీ, మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం సహా వనరులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. కుటుంబం నుంచి కమ్యూనిటీ ఆస్తుల వరకూ పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలుగా మన ఏపీ ముందంజలో ఉందన్నారు. ప్రతీ ప్రాంతానికీ, వర్గానికీ చేరువగా పాలన, అభివృద్ది అందుతుందన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అండగా నిలిచారని సీఎం వ్యాఖ్యానించారు.
















