Acharya Yarlagadda : అమెరికా – ప్రముఖ హిందీ, తెలుగు సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు మిచిగాన్ గవర్నర్ గౌరవ గ్రెట్చెన్ విట్మర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. యార్లగడ్డ అమెరికా పర్యటన సందర్భంగా గవర్నర్ ప్రత్యేకంగా లేఖ రాశారు. భారతీయ భాషల అభివృద్ధికి, సాంస్కృతిక బంధాల బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. మీరు భారతదేశం, అమెరికా మధ్య సాంస్కృతిక వారసత్వానికి మార్గం వేశారన్నారని తెలిపారు. సాహిత్య, విద్యా సేవలు అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ప్రేరణగా నిలుస్తున్నాయంటూ ప్రశంసించారు.
Michigan Govt – Acharya Yarlagadda Lakshmi Prasad
ఆంధ్ర విశ్వ విద్యాలయంలో హిందీ ఆచార్యులుగా, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్‌గా, విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షుడిగా, భారత ప్రభుత్వ హిందీ సలహా మండలిలో సభ్యుడిగా యార్లగడ్డ (Acharya Yarlagadda) నిర్వహించిన కీలక పాత్రలను గవర్నర్ గుర్తు చేశారు. ప్రధానంగా మీ సాహిత్య సేవలు, ముఖ్యంగా హిందీ, తెలుగు భాషల సౌందర్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయంటూ గవర్నర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సుదీర్ఘ కాలంగా భాష, సాహిత్యం, సాంస్కృతిక పరస్పర సంబంధాల కోసం కృషి చేస్తూ భారతీయ మేధస్సును ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తున్నారు. ఆయన విశ్వవ్యాప్త సాహిత్య చర్చలకు వేదిక కల్పిస్తూ, భాషల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి గౌరవాన్ని పెంపొందించిన యార్లగడ్డకు వచ్చిన ఈ గౌరవం తెలుగు వారందరికీ గర్వకారణమని పలువురు సాహితీ ప్రియులు అభిప్రాయ పడుతున్నారు.
Also Read : Warren Buffett – Record Breaking : ఆ ఫౌండేషన్ కు 50 వేళా కోట్లు విరాళంగా ప్రకటించిన వారెన్ బఫెట్
