వైద్య సేవ‌లు అందించేందుకు ఎంసీఆర్ టిమ్స్

త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

helloTelugu_TIMS

హైద‌రాబాద్ : ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్) సిద్ధమైంది. ఈ విష‌యాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టిమ్స్‌ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానున్నామని వెల్లడించారు. హాస్పిటల్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు, మౌలిక వసతులు, వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది, భద్రత, ఇతర సహాయక వ్యవస్థలను పరిశీలించారు హాస్పిటల్‌లోని ఎ, బి, సి బ్లాకులను మంత్రి సంద‌ర్శించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఉద్యోగులతో మాట్లాడి సేవల నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రారంభానికి ముందు పూర్తి చేయాల్సిన పనులు, అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మిగిలిన అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, హాస్పిటల్‌ను పూర్తిస్థాయి సేవలకు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులను ఆదేశించారు.

హాస్పిటల్ ప్రారంభమైన రోజు నుంచే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేసేలా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. హాస్పిటల్‌లో వైద్య సేవల నిర్వహణ, మౌలిక వసతులు, మానవ వనరులు, నాన్‌-మెడికల్ సర్వీసులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఫైర్ సేఫ్టీ, ఇతర వ్యవస్థలపై ఆరా తీశారు. హాస్పిటల్‌లోని ప్రతి విభాగం ప్రారంభానికి ముందే పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు, వారికి అవసరమైన అన్ని సహాయక సేవలు కూడా నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, పరిపాలనా సిబ్బంది తదితర మానవ వనరులను అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంచాలని సూచించారు.

డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను రాష్ట్రంలోని ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని మంత్రి తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలు, ఆధునిక మౌలిక వసతులు, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు, క్రిటికల్ కేర్, అత్యవసర వైద్యం, అవయవ మార్పిడి వంటి క్లిష్టమైన వైద్య సేవలను ఒకే వేదికపై అందించేలా టిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

Exit mobile version