తిరుమల : శ్రీ నృసింహ జయంతి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతిని ఏప్రిల్ 30వ తేదీ గురువారం తిరుమలలో వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో శ్రీ నృసింహ జయంతి ఉత్సవం చేపడతారు. శ్రీ యోగ నరసింహ స్వామివారి మూల మూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహ స్వామివారి ఉప ఆలయం ఉంది.
యోగ ముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.
శ్రీవారు, నరసింహ స్వామి భక్తగ్రేసరురాలైన మాతృశ్రీ తారీగొండ వెంగమాంబ జయంతి కూడా ఇవాళ ఘనంగా నిర్వహించింది టీటీడీ. ఈ సందర్భంగా తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పించారు. సాయంత్రం 5.30 గంటలకు ఉభయ నాంచారులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి పరిణయ మండపానికి వేంచేపు చేశారు. అక్కడ వెంగమాంబ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం చేశారు.
నారాయణగిరి ఉద్యానవనాల్లో వెంగమాంబ జయంతి అనంతరం ఉభయ నాంచారులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు తిరిగి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఇందులో టీటీడీ అధికారులు, వెంగమాంబ వంశస్థులు పాల్గొన్నారు.


















