హైదరాబాద్ : టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈవీ బస్సుల విస్తరణలో భాగంగా ప్రధాన డిపోలు, బస్టాండ్‌లలో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేని ప్రయాణాన్ని అందించడంతో పాటు, ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని ఈ ఈవీ బస్సులు కల్పిస్తాయని నాగిరెడ్డి వెల్లడించారు. సంస్థను లాభాల బాటలో నడిపిస్తూనే, ప్రయాణికులకు సురక్షితమైన , అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ నాగిరెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, కలెక్టర్ మను చౌదరి లు నూతన బస్సుల్లో ప్రయాణించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఆర్టీసీ ఈడీ లు సిహెచ్.వెంకన్న, రాజశేఖర్ లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
