Whatsapp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా పనిచేయకపోవడంతో లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెసేజ్‌లు పంపడం, స్వీకరించడం సాధ్యం కాకపోవడంతో సాధారణ వినియోగదారుల నుండి వ్యాపార వర్గాల వరకు అందరికి అంతరాయం కలిగింది.
Whatsapp Down
ఈ లోపం దాదాపు ఒక గంటపాటు కొనసాగింది. భారతదేశంతో పాటు యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా వంటి అనేక దేశాలలోనూ వినియోగదారులు సమస్యలను ఎదుర్కొన్నారు. కొందరికి యాప్ పూర్తిగా పనిచేయకుండా పోయింది. మరికొందరికి మాత్రం మెసేజ్‌లు పంపడం లేదా స్వీకరించడం సాధ్యం కాలేదు. దీంతో చాలామంది వినియోగదారులు ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు మారి, సోషల్ మీడియాలో తమ సమస్యలను పంచుకున్నారు.
ఈ సమస్యపై ఇప్పటివరకు వాట్సాప్ సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలోనూ ఇటువంటి అంతరాయాలు చోటుచేసుకున్నప్పటికీ, సంస్థ వాటిని తక్షణమే పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి.
ఇక వ్యాపార వర్గాలకైతే ఈ లోపం గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, కస్టమర్లతో నిరంతర సంబంధం అవసరమయ్యే వర్గాలు పనుల్లో అంతరాయం ఎదుర్కొన్నారు. అయితే, సాధారణ ప్రజల్లో కొందరు దీనిని తేలికగానే తీసుకున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మరల రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వినియోగదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ జీవితంలో కీలక సాధనంగా మారిన వాట్సాప్ పనితీరుపై ఆధారపడే కోట్లాది మందికి ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలిచింది.
Also Read : Stock Market Growth : నేడు లాభాల్లో నడిచిన స్టాక్ మార్కెట్
