విశాఖ వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు

ఏపీ పారిశ్రామిక ప్రగతికి నూతన దశదిశ

hellotelugu-CISummit

అమరావతి : నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్ థీమ్‌తో విశాఖ వేదికగా ఈ నెల 12, 13వ తేదీల్లో రెండు రోజుల పాటు 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగనుంది. మారుతున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలకు నూతన దశాదిశ అందించేలా ఈ పెట్టుబడుల సదస్సు విశాఖలో ఆవిష్కృతం కానుంది. కేవలం పెట్టుబడుల ఆకర్షణకు మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్యం నుంచి క్వాంటం వరకూ వివిధ అంశాలపై మేథోమథనం నిర్వహించి ఆ ఫలితాలను ముందుకు తీసుకెళ్లేలా ఈ భాగస్వామ్య సదస్సులో చర్చలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర హోం అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కానున్నారు. దాదాపు 58 దేశాలకు చెందిన ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ప్రపంచ మార్కెట్లతో ఏపీ పరిశ్రమల్ని అనుసంధానించటమే లక్ష్యంగా ఈ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్‌ను కీలక కేంద్రంగా నిలిచేలా ఈ సదస్సులో చర్చలు, ఒప్పందాలు జరుగనున్నాయి.

మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యం, సాంకేతికత, పరస్పర విశ్వాసం, నిపుణుల దార్శనిక ఆలోచనలకు ప్రాధాన్యమిస్తూ చర్చలు సాగనున్నాయి. ప్రపంచ దేశాలతో భారత ఆర్థిక భాగస్వామ్యానికి ప్రధాన వేదికగా ఈ సదస్సును 1995 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీపీఐఐటీతో కలిసి భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ పెట్టుబడుల సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమ్మిట్‌కు అధ్యక్షత వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 58 దేశాల ప్రాతినిధ్యం, 16 మంది విదేశీ మంత్రులు, 40 మంది అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరు కానున్నారు. సింగపూర్, నేపాల్, కంబోడియా, మయన్మార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా, స్లోవాక్ రిపబ్లిక్, మారిషస్, మొజాంబిక్, ఈజిప్ట్, అల్జీరియా, టాంజానియా, గ్వాటెమాలా తదితర దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. విధ దేశాల రాయబారులు, పారిశ్రామిక ప్రముఖులు, సాంకేతిక నిపుణులతో పాటు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఏడీబీ, యునెప్ లాంటి సంస్థల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సులో భాగంగా 400 పైచిలుకు బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో పాటు ప్రభుత్వాలతో పరిశ్రమల సంప్రదింపుల కోసం బీ టూ జీ సమావేశాలు కూడా జరుగనున్నాయి.

Exit mobile version