శ్రీ‌వారి గజ వాహన సేవలో అద్భుత కళా వైభవం

16 కళా బృందాలు 451 కళాకారులతో సందడి

hellotelugu-TTDCulturals

తిరుమల : తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా పుణ్య క్షేత్రంలో నిర్వహించిన గజ వాహన సేవలో దేశవిదేశాల కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలతో భక్తులను పరవశింప జేశారు. శ్రీ మలయప్ప స్వామి వారి వైభవానికి కళా నీరాజనాలు అర్పిస్తూ తిరుమల మాడవీధులను భక్తిరసంతో, సాంస్కృతిక వైభవంతో పులకింపజేశారు. ఖతర్ కళాకారులు భరత నాట్యం, దుబాయ్ కళాకారులు కూచిపూడి ప్రదర్శనలతో భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను చాటగా, పుదుచ్చేరి కళాకారులు కరగట్టం నృత్యంతో ఆకట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ కళాకారుల లంబాడీ నృత్యం, మహారాష్ట్ర కళాకారుల లెజిమ్స్, కర్ణాటక కళాకారుల గజేంద్ర మోక్షం నృత్య రూపకం, మధ్యప్రదేశ్ కళాకారుల కథక్, పంజాబ్ కళాకారుల భాంగ్రా ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి. ఈ సేవలో టీటీడీకి చెందిన నాలుగు ప్రాజెక్టుల నుంచి మొత్తం 16 కళా బృందాల్లో 451 మంది కళాకారులు పాల్గొన్నారు. హిందూ ధార్మిక ప్రాజెక్టు నుంచి 161 మంది, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల నుంచి 93 మంది, దాస సాహిత్య ప్రాజెక్టు నుంచి 114 మంది, అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి 81 మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. భక్తి, సంప్రదాయం, జానపద కళల సమ్మేళనంగా గజ వాహన సేవ భారతీయ సంస్కృతీ వైభవాన్ని చాటుతూ భక్తులకు కనువిందు చేసింది.

Exit mobile version