అమరావతి : ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది నవంబర్ 16 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాతావరణ వ్యవస్థ వాయవ్య దిశగా పయనించి 14 నాటికి మరింత బలపడి స్పష్టమైన అల్ప పీడనంగా మారే అవకాశం ఉంది. ఇది 15 ఉదయానికి ‘డిప్రెషన్’ (అల్పపీడన తీవ్రత పెరగడం)గా మారి 16 సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే నవంబర్ 18 , 19 తేదీల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్ ,ఒడిశాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 55 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు, కొన్ని ప్రాంతాల్లో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చు. సముద్రం కూడా అలజడిగా లేదా చాలా అలజడిగా ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు నవంబర్ 15 లోపు తీరానికి తిరిగి రావాలని వాతావరణ సంస్థ సూచించింది. రాబోయే రోజుల్లో అండమాన్ సముద్రంతో పాటు ఆగ్నేయ మరియు మధ్య బంగాళా ఖాతంలోని నిర్దేశిత ప్రాంతాల్లోకి వెళ్లవద్దని వారిని హెచ్చరించింది. ఈ తుపాను సూచన తూర్పు తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వాతావరణ వ్యవస్థ మరింత అభివృద్ధి చెందే కొద్దీ, అది ఏ దిశలో పయనిస్తుంది , ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై స్పష్టత వస్తుంది.
