మెట్ల బావుల పునరుద్ధరణపై హైడ్రా దృష్టి సారిస్తుంది

అకర్మ ఫౌండేషన్ కార్యక్రమంలో క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

hellotelugu-HYDRAA

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ నగరంలో చెరువులను పునరుద్ధరిస్తున్న హైడ్రా ఇప్పుడు మెట్ల బావులపై కూడా దృష్టి సారిస్తుందని పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ప్రకటించారు. కేబీఆర్ పార్కులో అకర్మ ఫౌండేషన్ “మీ బావి పేరు మీద” అనే నినాదంతో నిర్వహించిన అవగాహన, ప్రచార కార్యక్రమంలో ఈ ఇద్దరు అధికారులు మాట్లాడారు. మెట్ల బావుల ప్రాముఖ్యతను వివరించారు. క్యూర్ చట్టంలో మెట్ల బావుల పునరుద్ధరణకు కూడా నిబంధనలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. భూగర్భ జల వనరుల పరిరక్షణలో చెరువులతో పాటు మెట్ల బావులు కూడా అంతే ముఖ్యమైనవని వారు అన్నారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకడానికి, వరదలను నివారించడానికి మెట్ల బావులు ఎంతగానో ఉపయోగ పడతాయని తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా 600కు పైగా మెట్ల బావులు ఉండగా ఒక్క హైదరాబాద్‌లోనే 160కి పైగా ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారన్నారు. అదృశ్యమైన సరస్సును పునరుద్ధరించడం కొంత కష్టమైనప్పటికీ, మెట్ల బావులను సులభంగా తిరిగి వినియోగంలోకి తీసుకు రావచ్చని వారు అన్నారు. ఈ సందర్భంగా సరస్సుల పునరుద్ధరణకు హైడ్రా చేస్తున్న ప్రయత్నాలను హాజరైన వారందరూ ప్రశంసించారు. చరిత్రను పరిరక్షించడానికి సరస్సుల మాదిరిగానే మెట్ల బావులను కూడా పునరుద్ధరించాలని వారు కోరారు. ఇవి చారిత్రక సాక్ష్యాలుగా ఉపయోగ పడటమే కాకుండా, భవిష్యత్ తరాలకు తాగునీటి సమస్యలను నివారించడంలో కూడా సహాయ పడతాయని అన్నారు. మెట్ల బావుల పునరుద్ధరణకు అవసరమైన చర్యలపై చర్చించారు. మెట్ల బావుల పునరుద్ధరణకు తమ ఫౌండేషన్ పూర్తి మద్దతు అందిస్తుందని అకర్మ ఫౌండేషన్ ప్రతినిధి కౌశిక్ తెలిపారు.

Exit mobile version