హైదరాబాద్ లో అడుగు పెట్టిన లియోనెల్ మెస్సీ

సీఎం రేవంత్ రెడ్డితో ఉప్ప‌ల్ లో ఫ్రెండ్లీ మ్యాచ్

hellotelugu-MesssiArives

హైద‌రాబాద్ : ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గ‌జ ఆట‌గాడు లియోనెల్ మెస్సీ శ‌నివారం కోల్ క‌తా నుంచి ప్ర‌త్యేక విమానంలో హైద‌రాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాడు. ఈ సంద‌ర్బంగా భారీ భ‌ద్ర‌త మ‌ధ్య శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఫలక్ నుమాకు వెళ్లారు. ఇదిలా ఉండ‌గా లియోనెల్ మెస్సీని క‌లిసేందుకు కేవ‌లం 250 మందికి మాత్ర‌మే అనుమ‌తి ల‌భించింది. మెస్సీ రాక సంద‌ర్బంగా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు డీజీపీ ఆధ్వ‌ర్యంలో. ఏకంగా 3 వేల మందికి పైగా పోలీసుల‌ను మోహ‌రించారు. మ‌రో వైపు ఉప్ప‌ల్ లో రాత్రి జ‌రిగే మ్యాచ్ కు కేవ‌లం పాస్ లు, టికెట్లు ఉన్న వారినే అనుమ‌తించారు. ఇప్ప‌టికే కోల్ కతాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఆధారంగా భ‌ద్ర‌తను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు.

ఇక చౌమొహ‌ల్లా ప్యాలెస్ లో మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ ఫోటో సెష‌న్ ను ఏర్పాటు చేశారు. క‌లిసే వారికి ప్ర‌త్యేకంగా క్యూ ఆర్ కోడ్ ను ఇచ్చారు. మెస్సీతో ఫోటో దిగాలంటే క‌నీసం రూ. 10 ల‌క్ష‌లు చెల్లించాల్సి ఉంటుంది. కేవ‌లం 100 మందికి మాత్ర‌మే త‌న‌తో ఫోటో దిగేందుకు అవ‌కాశం ఇచ్చారు లియోనాల్ మెస్సీ. ఇప్ప‌టి వ‌ర‌కు 60 మందికి పైగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. డిస్ట్రిక్ట్‌ యాప్‌లో టికెట్లు బుకింగ్ చేసుకునే వీలు క‌ల్పించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు మీడియాతో మాట్లాడారు. మెస్సీ లాంటి ఆటగాడు ఇక్కడికి వచ్చి స్నేహ పూర్వక మ్యాచ్ ఆడటం మాకు, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి, అందమైన హైదరాబాద్ నగరానికి అదృష్టం అన్నారు.

Exit mobile version