కర్ణాటక : ఓ వైపు బిదాడి ప్రాజెక్టు వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందంటూ బీడీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మరో వైపు ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రిని కోరింది రైతుల బృందం . తమ సారవంతమైన వ్యవసాయ భూములను వదులుకోమని ఒక వర్గం రైతులు స్పష్టం చేస్తుండగా, మరో వర్గం రైతులు మాత్రం భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎంను కోరడం విశేషం. బెంగళూరు దక్షిణ జిల్లాలో ప్రతిపాదిత బిదాడి టౌన్‌షిప్ ప్రాజెక్ట్ వల్ల ప్రభావితం కానున్న బైరమంగళ , కంచుగారనహళ్లి గ్రామాలకు చెందిన రైతుల బృందం ప్రాజెక్ట్ కోసం తమ భూములను ఇచ్చేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు విన్నవించింది. అలాగ భూసేకరణ ప్రక్రియను త్వరగా మొదలుపెట్టేలా తుది నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేసింది.
బిదాడి పరిసర ప్రాంతాల్లోని ఒక వర్గం రైతులు ఈ ప్రాజెక్ట్ కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ తమ సారవంతమైన వ్యవసాయ భూములను వదులుకోమని స్పష్టం చేస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం డి.కె. శివకుమార్ బిదాడి ప్రాంత రైతులకు రెండు ఎంపికలను సూచించారు. ఎకరాకు రూ. 3 కోట్లు తీసుకోవడం లేదా అభివృద్ధి చేసిన భూమిగా 50 శాతం భూమిని తిరిగి పొందడం. దీనిపై బెంగళూరులోని విధాన సౌధలో డి.కె. శివకుమార్‌ను కలిసింది ఈ రైతు బృందం, తమను ‘రెడ్ జోన్’ హోదా నుండి విముక్తి కల్పించాలని ముఖ్యమంత్రిని కోరింది. బైరమంగళ ప్రాంతాన్ని రెడ్ జోన్ పరిధిలోకి చేర్చినప్పటి నుండి గత 20 ఏళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ప్రాంతం రెడ్ జోన్‌లో ఉంటే ఎటువంటి అభివృద్ధి జరగదు అని బైరమంగళ నివాసి సునీల్ పేర్కొన్నారు.
కేంద్ర భారీ పరిశ్రమలు , ఉక్కు శాఖ మంత్రి, జనతాదళ్ సెక్యులర్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ‘రెడ్ జోన్’ హోదాను తొలగించాలన్న రైతుల విజ్ఞప్తులను కుమారస్వామి పట్టించు కోలేదని విమర్శించారు.. రైతుల విజ్ఞప్తులకు స్పందించిన శివకుమార్, సంబంధిత అధికారులతో చర్చించిన తర్వాత భూసేకరణకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
