విజయవాడ : డీఎస్సీపై గొడ్డలి పార్టీ అధినేత చేస్తున్న ఆరోపణలపై చర్చకు తాను సిద్ధం అని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ జగన్‌కు సవాల్ విసిరారు. కంకిపాడు ఆయాన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ మాట్లాడారు. డీఎస్సీపై ఆరోపణలతోపాటు వైసీపీ హయాంలో లిక్కర్ భూ కుంభకోణాలపై కూడా చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీచేసిన చరిత్ర టీడీపీది అని, ఐదేళ్ల వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేని నీచ చరిత్ర జగన్‌ది అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేసి అత్యంత పారదర్శకంగా డిఎస్సీ నిర్వహిస్తే బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
150 రోజుల్లో విజయవంతంగా డిఎస్సీ నిర్వహిస్తే 150 కేసులు వేసి అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. వారు వేసిన కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టివే యడం మా చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి, సంక్షేమం అయితే, గొడ్డలి పార్టీ విధానం విధ్వంసం, బూతులు, బాబాయిని గొడ్డలి పార్టీతో లేపేయడం, తల్లి, చెల్లిని ఇంటి నుంచి తరిమేయడం, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కేడర్ పై ఉందన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు క్రెడిట్ చోరీ డిజార్డర్ (సీసీడీ) అనే జబ్బు ఉందంటూ నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన ఆర్సెలర్ మిట్టల్, గూగుల్, రాయల్ ఎన్ ఫీల్డ్ పరిశ్రమలను తానే తెచ్చానని చెప్పుకోవడం ఆయనకున్న జబ్బు లక్షణాలని ఎద్దేవా చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్నామని, వీటన్నింటినీ పార్టీ కేడర్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేష్ కోరారు.
