హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. భారీ కుట్రకు తెర లేపారంటూ ఆరోపించారు. ఇక్కడ ఏర్పాటైన పరిశ్రమలను ఏపీకి తరలించేందుకు ప్లాన్ చేశారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి సుమారు 5 వేల కంపెనీలు తరలి వెళ్ల బోతున్నాయని, దీని కారణంగా దాదాపు 50 వేల మందికి పైగా ఉపాధి కోల్పోతారని ఆవేదన చెందారు. ఇందుకు సంబంధించి హిల్ట్ పాలసీని తీసుకు వచ్చారంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల్లో దాదాపు అరవై శాతానికి పైగా ఏపీ వాసుల చేతుల్లోనే ఉన్నాయని అన్నారు కేటీఆర్. మూతబడిన కంపెనీ భూముల్లో రియల్ ఎస్టేట్ దందాకు హిల్ట్‌తో గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారని మండిపడ్డారు. కొత్త ఇండస్ట్రీల ఏర్పాటు చేయకుండా దానిని పక్కన పెట్టిందంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
నూతన పరిశ్రమలకు చవకగా భూములు కేటాయిస్తున్న ఏపీ. ఇక్కడ భూములు అమ్మి.. ఏపీలో ఫ్యాక్టరీల ఏర్పాటుకు కసరత్తు చేస్తోందన్నారు కేటీఆర్. పాలసీతో తెలంగాణ పారిశ్రామికం అతలాకుతలం కానుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో దాదాపు 20 శాతం వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నదని, ‘హిల్ట్’తో కుదేలు కానున్నదని ఆవేదన చెందారు. కాలుష్య కారక ఫ్యాక్టరీల తరలింపు పేరిట పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా సర్కార్ మారుస్తోందని ఆరోపించారు కేటీఆర్. ఏపీలోని కీలక నేత లాబీయింగ్‌తోనే ఇక్కడి పెద్దలు కొత్త పరిశ్రమల ఏర్పాటును గాలికి వదిలి వేశారని ఫైర్ అయ్యారు. ఇదే అదునుగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు గుట్టుచప్పుడు కాకుండా కసరత్తు మొదలు పెట్టిందన్నారు. హిల్ట్‌తో ఇక్కడి భూముల్లో పెద్దఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి, ఏపీ ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో అక్కడ కొత్త పరిశ్రమలను తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు.
