హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివాస్’గా ఘనంగా నిర్వహించు కోవాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదివారం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలంటూ దిశా నిర్దేశం చేశారు. కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని కేటీఆర్ గుర్తు చేశారు.
నవంబర్ 29న ‘దీక్షా దివస్’ను విజయవంతం చేసినట్లే, కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9ని విజయం సాధించిన రోజుగా విజయ్ దివస్’ పేరుతో పండుగలా జరుపుకోవాలని ఆయన సూచించారు. 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసిఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వలన ఒక రూపం వచ్చిందని కేటీఆర్ అన్నారు. అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ, ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును సంబరంగా నిర్వహించు కోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున, గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
