డెక్కన్ క్రానికల్ పై కేటీఆర్ ప‌రువు న‌ష్టం దావా

48 గంట‌ల లోగా బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

hellotelugu-KTR

హైద‌రాబాద్ : ఫేక్ కథనంపై డెక్కన్ క్రానికల్‌కు పరువు నష్టం నోటీసులు జారీ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఉద్దేశ పూర్వకంగా రాసిన ఆ కథనాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. జూలై 8 న‌ ఫ్రంట్ పేజీలో ప్రచురితమైన “KTR’s ‘Landlord’ Builds Tower in Hussainsagar” అనే కథనం తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఉద్దేశ పూర్వకంగా రాసినదని ఆయన తన న్యాయవాద బృందం పీవీ జనని అండ్ అసోసియేట్స్ ద్వారా పంపిన నోటీసులో స్పష్టం చేశారు. ఈ నోటీసును డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కి పంపించారు.

హుస్సేన్‌సాగర్ సమీపంలో ఒక ప్రైవేట్ డెవలపర్‌కు ఇచ్చిన భవన అనుమతులను జన్వాడలోని ఫామ్‌హౌస్ ఆస్తితో ముడిపెడుతూ ఈ కథనం తప్పుడు ఆరోపణలు చేసిందని కేటీఆర్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఆ ప్రైవేట్ ప్రాజెక్ట్, దాని డెవలపర్ లేదా భవన అనుమతులతో కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనడం పూర్తిగా అవాస్తవమని, పాత, నిరాధారమైన ఆరోపణలను ఉద్దేశ పూర్వకంగా మళ్లీ తెరపైకి తెచ్చారని ఖండించారు. కనీస ఆధారాలు లేకుండా కేవలం ఆయన ప్రతిష్ఠను, విశ్వసనీయతను దెబ్బ తీయాలనే దురుద్దేశంతోనే ఈ ఫేక్ న్యూస్ ప్రచురించారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు.

కనీస జర్నలిస్టు విలువలు పాటించకుండా, కేటీఆర్ వివరణ కోరకుండా చేసిన ఈ తప్పుకు గాను పబ్లిషర్‌కు 48 గంటల గడువు విధించారు. ఈ గడువులోగా సదరు పరువు నష్టం కలిగించే కథనాన్ని, దానికి సంబంధించిన డిజిటల్ లింక్‌లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే, జరిగిన నష్టానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించ కూడదని స్పష్టం చేశారు. ఈ షరతులను 48 గంటల్లోగా పాటించక పోతే, డెక్కన్ క్రానికల్ యాజమాన్యంపై తగిన సివిల్, క్రిమినల్, నష్టపరిహారం దావాలను వేస్తామని హెచ్చరించారు.

Exit mobile version