అమరావతి : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు మేలు చేకూర్చేలా ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇందుకు సంబంధించి మార్గ దర్శకాలు జారీ చేసింది.
1) వ్యాధితో బాధపడుతున్న రోగి ఎటువంటి నిర్బంధానికి గురికాకుండా, పూర్తి చేతనావస్థలో ఉండి, స్వతంత్రంగా, ఇద్దరు సాక్షుల సమక్షంలో ఇక ముందు తనకందించాల్సిన చికిత్సపై పరిస్థితులకనుగుణంగా తగు నిర్ణయం తీసుకునే గార్డియన్‌ను సూచిస్తూ సంతకంతో కూడిన’ ఎడ్వాన్స్ డైరెక్ట్‌వ్ ‘ని రూపొందించవచ్చు. దీనిని నోటరీ లేదా గజిటెడ్ అధికారి ధ్రువీకరించాలి.
2) చికిత్సకు లొంగక అవసాన దశకు చేరిన రోగి పరిస్థితిని చికిత్సనందిస్తున్న వైద్యులు పరీక్షించి ఎడ్వాన్స్ డైరెక్ట్‌వ్ లో పొందుపరచిన నిర్ణయాన్ని అందులో సూచించిన గార్డియన్ కు తెలియజేసి, కొనసాగుతున్న చికిత్సను ఆపివేయడం ఉత్తమమని వైద్యుడు నిర్ణయానికొస్తే ఆ సంగతి గార్డియన్‌కు వివరించాలి. ఇతరుల విషయంలో చికిత్సను ప్రారంభించడం నిష్ప్రయోజమని భావిస్తే ఆ విషయాన్ని గార్డియన్‌కు తెలపాలి.
3) అట్టి పరిస్థితుల్లో చికిత్సనందిస్తున్న ఆసుపత్రివారు అవసాన దశలో ఉన్న రోగి పరిస్థితిని పరిశీలించేందుకు, చికిత్సనందిస్తున్న వైద్యునితో పాటు 5 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన మరో ఇద్దరు వైద్యులతో ప్రైమరీ మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి 48 గంటల్లో ప్రాథమిక నిర్ణయాన్ని తీసుకోవాలి.
4) రోగికి చికిత్సనందించడం నిష్ప్రయోజనమని ప్రైమరీ మెడికల్ బోర్డు భావిస్తే సదరు వైద్యుడు, డిఎంహెచ్ఓ మరియు చికిత్సతో సంబంధంలేని మరో ఇద్దరు వైద్యులతో కూడిన సెకండరీ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలి.
5) ఈ రెండు మెడికల్ బోర్డుల అభిప్రాయాలను, గార్డియన్ సమ్మతిని ఆసుపత్రివారు చికిత్సను ఆపివేసే ముందు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు తెలియజేయాలి.
6) సెకండరీ మెడికల్ బోర్డు రోగికి చికిత్సను ఆపివేయడానికి అంగీకరించనపుడు రోగి సూచించిన గార్డియన్ హైకోర్టును ఆశ్రయించ వచ్చు. హైకోర్టు 20 ఏళ్ల అనుభవంగల వైద్యులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తుంది.
అనుకోని పరిస్థితుల్లో రోగి ఉన్నట్లయితే
7) అవసాన దశలో ఉన్న రోగి ముందస్తుగా ‘ఎడ్వాన్స్‌డ్ డైరెక్ట్‌వ్ ‘ను ఇవ్వని పరిస్థితుల్లో రోగి పరిస్థితిని సంబంధిత డాక్టర్ ఆసుపత్రివారికి తెలియజేస్తే, వారు ప్రైమరీ మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి రోగి సంబంధించిన వారితో చికిత్సను ఆపివేయడం లేక ప్రారంభించకపోవడం వలన కలిగే పరిణామాలను క్షుణ్ణంగా వివరించి వాటిని రాతపూర్వకంగా పొందుపరుస్తారు. అనంతరం సెకండరీ మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తారు. భిన్నాభిప్రాయాలు ఎదురైతే రోగి సంబంధీకులు హైకోర్టును ఆశ్రయించవచ్చు.
8) చివరిగా రోగికి లైఫ్ సపోర్టును తొలగిస్తే ఆ సంగతిని సంబంధిత మేజిస్ట్రేట్ హైకోర్టుకు తెలియపర్చాలి.
9) ఈ ప్రక్రియకు సంబంధించిన రికార్డుల్ని రోగి మరణానంతరం మూడేళ్ల వరకు భద్రపర్చాలి.
కారుణ్య మరణాలకు వీలు కల్పించే ఈ ప్రక్రియను అత్యంత పటిష్టంగా పర్యవేక్షించాలని, ఏ దశలోనూ పొరపాటు జరక్కుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
