తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కృత్తికా దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా వేలాది దీపాల వెలుగులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని ప్రమిదలను వెలిగిస్తూ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ముందుగా సాయంత్రం 5.30 గంటలకు గర్భాలయంలో దీపారాధన నిర్వహించారు. అనంతరం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభం, కొండపై దీపాలను వెలిగించారు. ఊంజల్ మండపంలో శివలింగం, త్రిశూలం ఆకృతుల్లో ఏర్పాటు చేసిన ప్రమిదలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
భక్తులు ఆలయ ప్రాంగణమంతా దీపాలను వెలిగించగా, అనంతరం జ్వాలాతోరణం వెలిగించారు .కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కృత్తికా దీపోత్సవం శివభక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, భక్తిపారవశ్యాన్ని అందించింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్రీవారి భక్తులు పాల్గొన్నారు. ఎటు చూసినా దీపాల వెలుగులో శ్రీ కపిలేశ్వర స్వామి వారు వెలిగి పోయారు. ఇదిలా ఉండగా కార్తీక దీపోత్సవం పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం సాధికారక మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఏ. శరత్, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
